792 బిలియన్‌ డాలర్లకు యాప్‌ ఎకానమీ

792 బిలియన్‌ డాలర్లకు యాప్‌ ఎకానమీ

దేశీయంగా యాప్‌ ఎకానమీ 2030 నాటి కి 792 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. తద్వారా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 12 శాతం వాటాను దక్కించుకోనుంది. బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం (బీఐఎఫ్‌) రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బీఐఎఫ్‌ తరఫున ఐసీఆర్‌ఐఈఆర్‌ సీనియర్‌ విజిటింగ్‌ ప్రొఫెసర్‌ రేఖా జైన్, ఐఐఎం అహ్మదాబాద్‌ ప్రొఫెసర్లు విశ్వనాథ్‌ పింగళి, అంకుర్‌ సిన్హా దీన్ని తయారు చేశారు.

మొబైల్‌ అప్లికేషన్ల చుట్టూ తిరిగే యాప్‌ల అభివృద్ధి, విక్రయం, ఇన్‌-యాప్‌ కొనుగోళ్లు, సబ్‌్రస్కిప్షన్లు, ప్రకటనల మొదలైన వాటి వ్యవస్థను యాప్‌ ఎకానమీగా నివేదిక వివరించింది. దీని ప్రకారం .. ప్రస్తుతం జీడీపీ 3,820 బిలియన్‌ డాలర్లుగా ఉండగా యాప్‌ ఎకానమీ 145 బిలియన్‌ డాలర్లుగా ఉంది. జీడీపీ 6,590 బిలియన్‌ డాలర్లకు చేరినప్పుడు ఇది 791.98 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. జీడీపీ వృద్ధి కన్నా నాలుగు రెట్లు అధికంగా యాప్‌ ఎకానమీ 32 శాతం స్థాయిలో వృద్ధి చెందనుందని జైన్‌ తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల పెరుగుదల, ఎకానమీ వృద్ధి ఇందుకు దోహదపడగలవని వివరించారు.