గిరిజన భాషల అనువాదానికి ‘ఆది వాణి’
- దేశంలోని గిరిజన సంస్కృతి, భాషలను పరిరక్షించే లక్ష్యంతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో పనిచేసే 'ఆది వాణి' అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించనుంది.
- ఈ యాప్ గిరిజన భాషలను అనువదించడంలో ఒక కీలక సాధనంగా ఉపయోగపడుతుంది.
- 'ఆది వాణి' యాప్ ముఖ్య ఉద్దేశ్యం దేశంలోని భాషా వైవిధ్యాన్ని కాపాడటం, అంతరించిపోతున్న గిరిజన భాషలను పరిరక్షించడం.
- 2011 జనగణన లెక్కల ప్రకారం, భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు 461 భాషలు మాట్లాడుతారు. వీటిలో 81 భాషలు దుర్బల స్థితిలో ఉన్నాయని, మరో 42 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని గుర్తించారు.
- ఈ యాప్ ద్వారా ఆయా భాషలను రికార్డ్ చేసి, డాక్యుమెంట్ చేయడం సాధ్యమవుతుంది.
- ఈ ప్రాజెక్టు కోసం వివిధ గిరిజన పరిశోధనా సంస్థలతో పాటు, ఐఐటీ దిల్లీ, బిట్స్ పిలానీ, ఐఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీ నవ రాయ్‌పూర్ వంటి ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలు సహకారం అందించాయి.
- ప్రారంభ దశలో, 'ఆది వాణి' యాప్ సంతాలీ (ఒడిశా), భిలీ (మధ్యప్రదేశ్), ముండారి (ఝార్ఖండ్), గోండీ (ఛత్తీస్‌గఢ్) భాషల్లో అనువాద సేవలను అందిస్తుంది.
- భవిష్యత్తులో కోయ, గారో వంటి మరిన్ని గిరిజన భాషలను కూడా ఈ యాప్‌లో చేర్చాలని కేంద్రం యోచిస్తోంది.
- ఈ యాప్ గిరిజన భాషల్లో మాట్లాడే మాటలను హిందీ, ఇంగ్లిష్‌లోకి అనువదించడమే కాకుండా, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోని సమాచారాన్ని ఆయా గిరిజన భాషల్లోకి అనువదించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.
- ఈ యాప్ గిరిజనులకు ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యం, విద్య వంటి ముఖ్యమైన విషయాలపై సులభంగా అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ పేర్కొంది.
1. గిరిజన భాషలను అనువదించడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి?
- గిరి వాణి
- భాషా సేతు
- భారత్ వాణి
- ఆది వాణి