దేశీయ విమాన ప్రయాణికులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో గతేడాది కంటే 7-10% పెరిగి 16.4 17.0 కోట్లకు చేరొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఇదే సమయంలో విమానయాన పరిశ్రమ రూ.2,000-3,000 కోట్ల నష్టాలను నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 5.3% పెరిగి 7.93 కోట్లకు చేరిందని తెలిపింది.
ఏప్రిల్-మే నెలల్లో తీవ్ర ఎండలు, ఇతర వాతావరణ సంబంధిత అంతరాయాల వల్ల విమాన ప్రయాణికుల వార్షిక వృద్ధిపై ప్రభావం చూపిందని ఇక్రా వెల్లడించింది.
2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో భారత విమానయాన పరిశ్రమ రూ.2,000-3,000 కోట్ల మధ్య నికర నష్టాన్ని నమోదు చేయొచ్చని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసి డెంట్, కో-గ్రూప్ హెడ్ కింజల్ షా అభిప్రాయపడ్డారు.
విమానయాన సంస్థలకు ప్రధానంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు, రూపాయి-డాలర్ కదలికలు కీలకం, వార్షిక ప్రాతిపదికన ఏటీఎఫ్ ధర ఈ ఆర్థిక సంతవ్సరం తొలి 8 నెలల్లో సగటున 6.8% పెరిగి కిలోలీటరు రూ.96,162కు చేరింది.
2019-20 ఆర్థిక సంవత్సరం (కొవిడ్ కు ముందు) 8 నెలల్లో ఏటీఎప్ కిలోలీటరు ధర రూ.65,261గా ఉండేది. ఆ స్థాయిని మించి ప్రస్తుతం ధరలు ఉన్నాయి. విమానయాన సంస్థల వ్యయాల్లో 30-40% ఇంధన ఖర్చులే ఉంటాయి.