జూన్‌ జీఎస్టీ వసూళ్లు 1.61 లక్షల కోట్లు

జూన్‌ జీఎస్టీ వసూళ్లు 1.61 లక్షల కోట్లు

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల జూన్‌లో రూ.1,61,497 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఇదే నెలతో పోల్చితే ఈసారి వసూళ్లు 12 శాతం పెరిగినట్టు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెంట్రల్‌ జీఎస్టీ రూ.31,013 కోట్లుగా, స్టేట్‌ జీఎస్టీ రూ.38,292 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూ.80,292 కోట్లు (దిగుమతైన గూడ్స్‌పై వసూలు చేసిన రూ.39,035 కోట్లుసహా), సెస్సు రూ.11,900 కోట్లు (దిగుమతైన గూడ్స్‌పై వసూలు చేసిన రూ.1,028 కోట్లుసహా)గా ఉన్నాయని ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇక ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ వసూళ్ల నుంచి సెంట్రల్‌ జీఎస్టీకి రూ.36,224 కోట్లు, స్టేట్‌ జీఎస్టీకి రూ.30,269 కోట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. కాగా, దిగుమతి, సర్వీసులుసహా దేశీయ లావాదేవీల నుంచి ఈ జూన్‌లో రెవిన్యూ గత ఏడాది జూన్‌తో పోల్చితే 18 శాతం పెరిగినట్టు తేలింది.

తెలంగాణలో 20% పెరుగుదల
రాష్ట్రంలో గత నెల జీఎస్టీ రెవిన్యూలో గత ఏడాది జూన్‌తో పోల్చితే 20 శాతం వృద్ధి నమోదైంది. నిరుడు జూన్‌లో రూ.3,901.45 కోట్లుగా ఉంటే, ఈ ఏడాది జూన్‌లో జీఎస్టీ రెవిన్యూ రూ.4,681. 39 కోట్లుగా ఉన్నది. ఇక ఈ జూన్‌ ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ వసూళ్లలో స్టేట్‌ జీఎస్టీ వాటా కింద తెలంగాణకు కేంద్రం రూ.1,621. 37 కోట్లు చెల్లించింది.