భార‌త మాజీ అంపైర్ క‌న్నుమూత‌

భార‌త మాజీ అంపైర్ క‌న్నుమూత‌

భార‌త మాజీ అంపైర్ పీలూ రిపోర్ట‌ర్‌(Piloo Reporter) క‌న్నుమూశాడు. త‌ట‌స్థ వేదిక‌ల‌ అంపైర్‌(Neutral Venue Umpire)గా గుర్తింపు పొందిన ఆయ‌న‌ 84 ఏళ్ల వ‌య‌సులో తుది శ్వాస విడిచాడు. పీలూ కొంత కాలంగా సెరెబ్ర‌ల్ కంటూష‌న్స్ (cerebral contusions) అనే మెదడు సంబంధిత స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నాడు. చాలా రోజుల క్రితం మంచం ప‌ట్టిన అత‌ను ఈ రోజు ముంబైలోని నివాసంలో మ‌ర‌ణించాడు.
పీలూ అంపైరింగ్ కెరీర్ 1984లో మొద‌లైంది. ఆ ఏడాది ఢిల్లీ వేదిక‌గా భార‌త్, ఇంగ్లండ్ త‌ల‌ప‌డిన మ్యాచ్‌లో పీలూ అంపైర్‌గా తొలిసారి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. అదే సంవ‌త్స‌రం ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌తో తొలిసారి వ‌న్డేల్లో అంపైరింగ్ చేశాడు. 1986లో భార‌త్‌కే చెందిన‌ వీకే రామ‌స్వామి(VK Ramaswami)తో క‌లిసి పీలూ పాకిస్థాన్, వెస్టిండీస్ జ‌ట్లు త‌ల‌ప‌డిన‌ లాహోర్ టెస్టుకు అంపైర్‌గా ఉన్నాడు. దాంతో, అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో త‌ట‌స్థ అంపైర్లుగా వ్య‌వ‌హ‌రించిన‌ జోడీగా వీళ్లిద్ద‌రూ చరిత్ర సృష్టించారు.