జ‌మిలి - 8 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ

జ‌మిలి - 8 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ

దేశంలో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు 8 సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఈ జమిలి కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులామ్‌ నబీ ఆజాద్‌, ఫైనాన్స్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ సభ్యులుగా ఉంటారు.

జమిలి కమిటీలోని సభ్యుల వివరాలు..
రామ్‌నాథ్‌ కోవింద్‌
యూపీలోని కాన్పూర్‌కు చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ భారత దేశ 14వ రాష్ట్రపతిగా 2017 నుంచి 22 వరకు విధులు నిర్వహించారు. 77 ఏండ్ల రామ్‌నాథ్‌ 2015 నుంచి 2017 వరకు బీహార్‌ గవర్నర్‌గా ఉన్నారు. 1994 నుంచి 2006 వరకు ఎంపీగా వ్యవహరించారు. దళిత నేత అయిన కోవింద్‌ను మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. రాజకీయాల్లోకి రాకముందు ఆయన సుప్రీం కోర్టు లాయర్‌గా పనిచేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలుగేండ్లు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు.

అమిత్‌ షా
కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్‌ షా కేంద్రంలో నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. ఆయన తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న 59 ఏండ్ల షా 2019 నుంచి హోం శాఖ నిర్వహిస్తున్నారు. 2014 నుంచి 2020 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. 2019లో గాంధీనగర్‌ నుంచి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

అధీర్‌ రంజన్‌ చౌదరి
బెంగాల్‌కు చెందిన అధీర్‌ రంజన్‌ 1999లో బెర్హంపూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికై తరువాత వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. గతంలో రైల్వే శాఖ సహాయమంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.

గులామ్‌ నబీ ఆజాద్‌
కశ్మీర్‌కు చెందిన గులామ్‌ నబీ ఆజాద్‌ కశ్మీర్‌కు ఏడో ముఖ్యమంత్రిగా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2022లో ఆయనకు ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది. ఇటీవల కాంగ్రెస్‌తో విభేదించి బయటకు వచ్చి డెమొక్రటిక్‌ ఆజాద్‌ పార్టీని ప్రకటించారు.

ఎన్‌కే సింగ్‌
ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ఐఏఎస్‌ అధికారి, రాజకీయవేత్త అయిన 82 ఏండ్ల నంద కిషోర్‌ సింగ్‌ బీజేపీలో 2014 నుంచి సీనియర్‌ మెంబర్‌గా కొనసాగుతున్నారు. 2008 నుంచి 2014 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 15వ ప్లానింగ్‌ కమిషన్‌ చైర్మన్‌గా పనిచేసిన ఆయన దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఓఎస్‌డీగా సేవలు అందించారు.

సుభాష్‌ సి కశ్యప్‌
సుభాష్‌ సి కశ్యప్‌ జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించారు.న్యాయవాదిగా, అధ్యాపకునిగా పనిచేశారు. 1953లో పార్లమెంట్‌ సెక్రటరీగా చేరారు. అక్కడ 37 ఏండ్ల పాటు పనిచేశారు. 1983లో లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అయ్యారు. 1990లో వలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు.

హరీష్‌ సాల్వే
మహారాష్ట్రకు చెందిన 68 ఏండ్ల హరీశ్‌ సాల్వే ప్రముఖ న్యాయవాది. 1999 నుంచి మూడేండ్ల పాటు సాలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా పనిచేశారు. కులభూషణ్‌ జాదవ్‌ కేసులో ఆయన తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాడారు.

సంజయ్‌ కొఠారి
రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన సంజయ్‌ కొఠారి మాజీ రాష్ట్రపతి కోవింద్‌కు కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా 2020లో బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఆయన నియామకాన్ని కమిటీలో సభ్యుడిగా ఉన్న అధీర్‌ వ్యతిరేకించారు.