భారత సంతతి సైనికుడికి రిషి సునాక్ సత్కారం

భారత సంతతి సైనికుడికి రిషి సునాక్ సత్కారం

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారత సంతతి మాజీ సైనికుడు రాజిందర్ సింగ్ దత్‌ను(101) బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పాయింట్స్ ఆఫ్ లైట్ ఆనర్ అవార్డుతో సత్కరించారు. నాడు యుద్ధంలో పాల్గొన్న భారత సంతతి సైనికులకు ఏకతాటిపైకి తెచ్చేందుకు పాటుపడ్డ దత్‌కు ఈ అవార్డు దక్కింది. భారత సంతతి సైనికుల కోసం దత్ ‘‘అన్‌డివైడెడ్ ఇండియన్ ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్‌’’ను(Undivided Indian exserivce men association) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న దత్ 1921లో అప్పటి అవిభాజ్య భారత్‌లో జన్మించారు. బ్రిటీష్ సేనల తరపున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. 1963 నుంచీ ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ సైన్యంలో చేరిన దత్ అంచెలంచెలుగా ఎదుగుతూ 1946లో హవిల్దార్ మేజర్ స్థాయికి చేరుకున్నారు. జపాన్‌కు వ్యతిరేకంగా ఈశాన్య భారత్‌లో పారాడుతున్న బ్రిటీష్ సైన్యంలో ఆయన కొంతకాలం పనిచేశారు. యుద్ధం అనంతరం భారత్‌కు తిరిగొచ్చిన ఆయన ఆ తరువాత బ్రిటన్‌లోనే తన కుటుంబంతో సహా సెటిలయ్యారు.