గతంలో పేర్లు మార్చుకున్న దేశాలివే

గతంలో పేర్లు మార్చుకున్న దేశాలివే

తుర్కియే
ఈమధ్యకాలంలో పేరు మార్చుకున్న దేశం తుర్కియే. 2022లో ఐక్యరాజ్యసమితి ఆమోదంతో టర్కీ అని ఉన్న తమ దేశం పేరును తుర్కియేగా మార్చుకుంది. ఇలా పేరు మార్చుకోవడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే.. టర్కీ అంటే ఫెయిల్యూర్‌, మూర్ఖుడు, సిల్లీఫెలో అని ఇంగ్లిష్‌లో అర్థం వస్తుంది. దీంతో తక్కువ చేసేలా ఉన్న పేరును మార్చుకోవాలని భావించారు.

శ్రీలంక
శ్రీలంక దేశానికి కూడా గతంలో చాలా పేర్లు ఉండేవి. విజయ అనే రాజు పాలించినపన్పుడు ఆ దేశాన్ని తంబపన్నీ అని పిలిచేవారు. దీన్నే రామాయణంలో లంక అని పేర్కొన్నారు. తమిళులు ఈలం అని పిలిచేవారు. ఇలా ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ క్రీ.శ.993 తర్వాత కోలా వంశస్థుల పాలనలో ముమ్ముడి కోలమండలంగా ప్రాచుర్యం పొందింది. గ్రీక్‌ భౌగోళిక శాస్త్రవేత్తలు టాప్రోబానా అని.. పర్షియన్లు, అరబ్‌లు సారాందాబ్‌ అని పిలిచేవారు. అయితే 1505లో పోర్చుగీస్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత మాత్రం వాళ్లు సీలోన్‌ అని పేరు పెట్టారు. ఆ తర్వాత బ్రిటీషర్స్‌ కూడా అదే పేరును కంటిన్యూ చేశారు. ఆంగ్లేయుల ఆధిపత్యం నుంచి బయటపడిన తర్వాత 1972లో సీలోన్‌ అనే పేరును శ్రీలంకగా మార్చుకున్నారు.

మయన్మార్‌
 మయన్మార్‌ను గతంలో బర్మా అని పిలిచేవారు. ఇక్కడి బర్మన్‌ ప్రజలు మాట్లాడే భాషను బర్మీస్‌/మైన్మ/బామ అని అంటారు. దీంతో ఆ దేశాన్ని బర్మా అని పిలిచేవారు. అయితే ప్రజాస్వామ్య పాలనను అణిచివేసిన అనంతరం ఒక ఏడాది తర్వాత అంటే.. 1989లో మిలటరీ లీడర్లు హఠాత్తుగా బర్మా పేరును మయన్మార్‌గా మార్చేశారు.

చెకియా
చెకియా కంటే చెక్‌ రిపబ్లిక్‌ అంటేనే చాలామందికి తెలుసు. ఈ దేశాన్ని మొదట్లో బోహెమియా అని పిలిచేవారు. ఈ దేశానికి అప్పట్లో స్లావిక్ తెగ నాయకుడు చెక్‌ వచ్చి స్థిరపడ్డారు. ఈ తెగ వాళ్లు మాట్లాడే భాషను కూడా చెక్‌ అనే పిలిచేవారు. అయితే 1918లో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అప్పుడు చెక్‌, స్లోవక్‌ జాతీయులు కలిసి ఉన్నారని చెప్పడానికి బోహెమియా పేరును కాస్త చెకోస్లోవేకియాగా మార్చారు. కానీ 1992లో చెకోస్లోవేకియా విడిపోయింది. ఆ సమయంలోనే చెక్‌ రిపబ్లిక్‌ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అందరూ చెక్ రిపబ్లిక్‌ అని పిలిచినప్పటికీ.. అక్కడి ప్రభుత్వం అధికారికంగా చెకియా అనే సంక్షిప్త నామంతో పిలవాలని 2016లో నిర్ణయించింది.

ఎష్వతిని
ఆఫ్రికా ఖండంలోని స్వాజిలాండ్‌ దేశం కూడా తన పేరును ఎష్వతినిగా మార్చుకుంది. నిజానికి పూర్వం స్వాజిలాండ్‌ దేశం ఎష్వతిని రాజ్యంగా ఉండేది. స్వాజి తెగకు చెందిన ప్రజలకు అక్కడ స్థిరపడటంతో దాన్ని స్వాజిలాండ్‌గా పిలవడం మొదలుపెట్టారు. అయితే సొంత భాషలోనే తమ దేశం పేరు ఉండాలనే ఉద్దేశంతో 2018లో స్వాజిలాండ్‌ చక్రవర్తి స్వాటి- III తమ దేశం పేరును ఎష్వతినిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాంబోడియా
కాంబోడియా దేశాన్ని గతంలో కంపుచేయా అని పిలిచేవారు. కంపూచేయా అనే పదాన్ని తప్పుగా పలకడంతో దాని పేరు కాంబోడియాగా మారిందనే వాదనలు ఉన్నాయి. 1953-70 మధ్య కంపుచేయాను కింగ్‌డమ్‌ ఆఫ్‌ కాంబోడియాగా పిలిచారు. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం.. గత సర్కార్‌ నిర్ణయాన్ని పక్కనబెట్టి ఖైమర్‌ రిపబ్లిక్‌గా నామకరణం చేసింది. 1975 వరకు ఇదే పేరు కొనసాగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం మళ్లీ డెమోక్రటిక్ కంపుచేయాగా దేశం పేరును మార్చేసింది. ఇలా దేశం పేరును తరచూ మారుతూ వస్తున్న క్రమంలోనే 1989 తర్వాత ఐక్యరాజ్యసమితి కలగజేసుకుని స్టేట్‌ ఆఫ్‌ కాంబోడియాగా మార్చేసింది. కానీ 1993లో ప్రజాస్వామ్య వ్యవస్థపోయి ఆ దేశంలో మళ్లీ రాజరిక పాలన మొదలైంది. దీంతో స్టేట్‌ ఆఫ్‌ కాంబోడియాను కాస్త కింగ్‌డమ్‌ ఆఫ్‌ కాంబోడియాగా మార్చేశారు. ఇప్పుడు సింపుల్‌గా కాంబోడియా అని పిలుస్తున్నారు.

థాయిలాండ్‌
థాయిలాండ్‌ను గతంలో సియామ్‌ అని పిలిచేవారు. కానీ అక్కడి ప్రజలు మాత్రం మొదట్నుంచి తమ దేశాన్ని ముయాంగ్‌ థాయి అని పిలుచుకునేవారు. ఈ క్రమంలోనే 1939లో అప్పటి సియామ్‌ చక్రవర్తి తమ దేశానికి థాయిలాండ్‌ అని పేరు పెట్టారు. స్థానిక భాష ప్రకారం థాయిలాండ్‌ అంటే స్వతంత్ర ప్రజలు ఉన్న దేశమని అర్థం.

కాంగో
కాంగో దేశాన్ని గతంలో కాంగో ఫ్రీ స్టేట్‌, బెల్జియం కాంగో, కాంగో లియోపొల్డివిల్లే అని పిలిచేవారు. ఈ దేశంలో కాంగో నది ఉండేది. దాని పేరు మీదనే దేశం పేరులో కాంగోను చేర్చారు. అయితే 1960లో బెల్జియం నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత తమ దేశానికి రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోగా నామకరణం చేసుకున్నారు. 1965 నుంచి 1971 మధ్యలో డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోగా పిలిచారు. కానీ 1971లో అప్పటి దేశాధ్యక్షుడు మొబుటు సెసె సెకో.. మరోసారి దేశం పేరును మార్చేశారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ జైర్‌గా మార్చేయగా.. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ పాత పేరువైపే మొగ్గుచూపింది. దీంతో ఆ దేశం పేరు మళ్లీ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగోగా మారింది.

ఇరాన్‌
ఇప్పుడు మనందరికీ తెలిసిన ఇరాన్‌ను గతంలో పర్షియా అని పిలిచేవారు. రెజా షా రాజు అయిన తర్వాత పర్షియా పేరును ఇరాన్‌గా మార్చేశారు. 1935 నుంచి పర్షియా దేశాన్ని ఇరాన్‌గా పిలుస్తున్నారు. కాకపోతే ఆ దేశంలో నివసించే ప్రజల్ని ఇప్పటికీ పర్షియన్లుగానే గుర్తిస్తారు.

ఇవే కాకుండా పలు దేశాలు కూడా వివిధ కారణాలతో పేర్లను మార్చేశాయి. హోలాండ్‌ను నెదర్లాండ్స్‌గా, ట్రాన్స్‌ జోర్డాన్‌ను జోర్డాన్‌గా, అబిస్సినియాను ఇథియోపియాగా, జర్మన్ సౌత్‌ వెస్ట్‌ ఆఫ్రికాను నమిబీయాగా మార్చారు.